సీ: మాది విజయవాడ ఆదిలో బెజవాడ
బ్లేజువాడనుట రివాజుకూడ
మాది చలన చిత్ర మకుటాయమానమౌ
నిర్మాణ సంస్థల నెలవు వాడ
మాది ధూమశకటాల్ మదరాసు బొంబాయి
కలకత్త మార్గాల కలుపువాడ
ఆసియా ఖండాన అదిపెద్ద బస్టాండు
కలిగియున్నట్టి ఏకైక వాడ
ప్రాంతీయ దేశీయ పరదేశ వార్తలన్
ప్రచురించు పత్రికారంగవాడ
పుస్తకమేళాతొ మస్తుగా పాఠకు
ల్నెంతొమెప్పించు సాహిత్యవాడ
పదవికోసము ఎన్నొ పార్టీలు మార్చెడి
రాజకీయ చతురలాస్యవాడ
మీటర్లు వేయక మెండుగా చార్జీలు
దండించు ఆటోల నిండువాడ
ఏపరీక్షలకైన ఇచ్చు శిక్షణశాల
లెన్నొ వెలసిన సంపన్నవాడ
స్వర్ణాంధ్ర లక్ష్యమౌ జన్మభూమి పనులన్
సహకారమందించు జనతవాడ
పావన కృష్ణమ్మ ప్రవహించు తీరాన
కనకదుర్గామాత కరుణవాడ
తే.గీ: కవుల పాలిటి కాణాచి, గానకళల
నిలయమాకాశవాణికి, నృత్య నటన
పాటవాలకు దీటైనవాడ, యిటుల
పేరుగాంచినట్టిది మాది విజయవాడ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment