Tuesday, July 10, 2012

ఉల్లి చేసిన మేలు (ఎవరికి?)

ఏమిటి ఈవేళ చాలా హుషారుగా వున్నారు?" అని అడిగింది శ్రీమతి ఆఫీసుకు బయల్దేరబోతున్న నన్ను చూసి

         “ఈ రోజు రెండు నెలల బోనసు ఇస్తున్నారు" అన్నా

         “హమ్మయ్య! అయితే నా గాజులు వెనక్కి వచ్చేస్తాయన్నమాట" అంది

         “గాజులా? “ అన్నా హాశ్చర్యంగా

         “అదేమిటండి మర్చిపోయారా నా గాజులు తాకట్టుపెట్టి మోపేడ్ కొన్న సంగతి?" అంది అనుమానంగా నాకేసి చూస్తు

         “అవును కదూ! నిజమే! అయినా వటీ! ఇప్పుడు వాటికి తొందరేం వచ్చింది. అసలే దొంగల భయం ఎక్కువగా వుంది. అవి బ్యాంకులో వుంటే లాకర్లో వున్నంత సేఫ్ “ అన్నా

         “చేతికి వేసుకుంటానుగదా! భయందేనికి? అలమార్లో పెట్టి బయటకు వెళ్ళితే ఎవడైనా వచ్చి దోచుకు వెడతాడని భయపడాలి గాని. అయినా గాజులు తాకట్టుపెట్టేనాడు ఏమన్నారు? ఈసారి బోనసు రాగానే విడిపిస్తాననలేదూ?"

         “అన్నాననుకో! కానీ వటీ! నేను స్కూటరు కొనుక్కుందామనుకుంటున్నా! వాయిదాల మీద కొనుక్కోవచ్చు. కాకపోతే నాలుగోవంతు మనం కట్టాలి. “

         “మనం అనకండి మీకు మోపేడు వుందిగా! మళ్ళీ ఈ స్కూటరు ఎందుకు?"

         “మోపేడు వాడుతూవుంటే చిన్నతనంగావుంది వటీ! ప్లీజ్ ఈసారికి నన్ను క్షమించు. త్వరలో గాజులు విడిపిస్తానుగా?" అన్నా బ్రతిమాలుతున్నాట్టు

         “హు! కానీండి. నావంటిమీద ఇదిగో ఈపుస్తెలు తప్ప చిన్నమెత్తు బంగారం లేదు. చేతికి ప్లాస్తిక్ గాజులు! “ అని రుసరుసా లోపలకి వెళ్ళిపోయింది
 బ్రతుకు జీవుడా అనుకొని బయటకు వచ్చేసా. సాయంత్రం ఆరుగంటలకు ఇంటికి వచ్చా! బోనసు సొమ్ము జేబులో వుంది. ఎందుకనో స్కూటరు కొనడం కొన్నాళ్ళు వాయిదా వేద్దాం అంతవరకూ బ్యాంకులో డిపాజిట్ చేదాం అనిపించింది. ఈ రాత్రి తనను కూర్చోబెట్టి, స్కూటరు కొంటేవున్న సుఖం చెప్పి తనని వప్పించి మరీ స్కూటరు కొందామని అనుకున్నా. పక్క జేబులో వున్న మల్లెపువ్వులదండను ఒకసారి తడిమి చూసుకొని లోపలకి అడుగుబెట్టా! హాలులో కనపడలేదు. వంటింట్లో చప్పుడు అవుతోంది. నిమ్మదిగా వంటింట్లోకి వెళ్ళా.

         చప్పుడు చెయ్యకుండా వెళ్ళి వెనకనుంచి రెండు చేతులతో కళ్ళు మూసా.

         షాకయ్యా!!

         చేతికి కన్నీళ్ళు తగిలాయి

         ఇదేమిటి? ఏడుస్తోందా?

         ఛా! వెధవస్కూటరుకోసం తన గాజులు విడిపించకుండా ఏడిపిస్తున్ననా?

         మనసులో తెలియని బాధ!!

         వెంటనే జేబులోంచి బోనసు సొమ్ము, మల్లెపువ్వుల దండ తీసి పక్కకి వెళ్ళి
         “ఇదిగో వటీ! బోనసు సొమ్ము మొత్తం నీకే ఇస్తున్నాను. రేపే నీగాజులు విడిపించి తీసుకువస్తా! ఛా! పిచ్చిదానా! ఏదో సరదాగా అన్నాగాని,ఈమాత్రం దానికి కన్నీళ్ళు పెట్టుకోవాలా?" అన్నా

         “వుల్లిపాయలు తరుగుతూంటే కన్నీళ్ళు రాకేంచేస్తాయి" అంటూ మల్లెపువ్వులలోతో బాటు బోనసుకూడా తీసుకుంది చెంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ!

         ఈసారి అవాక్కయ్యా!!.

View Comments(3)    Post a Comment    By - Virabhadra Sastri Kalanadhabhatta
 
      1  2         Page

No comments: