Tuesday, July 10, 2012

వానప్రస్థము

కష్టమేపడె తననామె కనెడువేళ
చంకనెత్తుకు పెంచెను, చన్నుగుడిపె
తప్పటడుగులు వేసెడి తరుణమందు
పట్టువదలక నడిపించె మెట్టు మెట్టు

గోరుముద్దలు తినిపించె కూర్మితోడ
కంటికిన్ రెప్పవలె తన్నుకాచె నెపుడు
ఇప్పుడా కన్నులె సరిగ విప్పలేదు
లేచితిరుగాడ వంటిలో లేదుశక్తి

చదువుకొనగ జేర్చెను పాఠశాలయందు
పెంచి పెద్ద చేసెనమిత ప్రేమతోడ
తగిన కన్యనిల్లాలుగా తనకు గూర్చె
అతడు జనకుడు ఇపుడసహాయుడయ్యె

ముసలివారంచు ఛీకొట్టి మోము దాచి
వారికర్మకు వారిని వదలివేసి
తాము తమబాగు నెంచెడి తనయులుండు
రోజులివి ఔర హరహరా ! రోతపుట్టు

నన్నుకన్నట్టి జననీజనకులు వీరు
వయసు వుడిగిన వేళలో వారిబాగు
చూడవలెననెడి తపన సుంతయేని
సుతులకేది ? వృద్ధాశ్రమ చూపు తప్ప

No comments: