Monday, July 9, 2012

ప్రేమకు ఆవలివైపు

అతని అడుగుల సవ్వడికోసం
ఆ అర్ధరాత్రివేళ నిరీక్షిస్తోంది
వణుకుతున్న చేతులతో మొహంమీదపడ్డ
ముంగురులను సవరించుకుంటోంది
ఇల్లు నీటుగా సర్దివుంచింది
పక్కమీద దుప్పటి మార్చింది
డిన్నరు టెబిల్ మీద భోజనం సిద్ధం చేసి పెట్టింది
అతనికి ఇష్టమైన వేపుడు చేసింది
బాత్ రూంలో టవల్ లుంగీ రెడీగా పెట్టింది
కుర్చీలో కూర్చొని పత్రిక తిరగేయసాగింది
అక్షరాలు కనపడడం లేదు
పాత గుర్తులు కదలాడుతున్నాయి
తమ ప్రేమను అంగీకరించని పెద్దల్ని
కాదని వచ్చేసిన సంఘటన
వచ్చాక నిలదొక్కుకోడానికి తాము పడ్డ శ్రమ
సినిమారీళ్ళులాగ మనస్సులో తిరగసాగాయి
ఆవలింతలు వస్తున్నాయి
చిన్న మాగన్ను
గబుక్కున లేచింది
గుమ్మందగ్గర్ అడుగుల చప్పుడు
అదురుతున్న గుండెను చిక్కబట్టుకొని
లేచినిలుచుంది కొనాశతో
ఈవేళైనా అతను తాగకుండా రావాలని
తనకు దెబ్బలు తప్పాలని

No comments: