Sunday, July 15, 2012

సన్మానం లో బ్రేక్

శాస్త్రిగారు కుటుంబ సభ్యులతో (షరా: పెద్దవాళ్ళతోనే) టీవీలో అలనాటి పురాణచిత్రం ద్రౌపదీమానసంరక్షణ చూస్తున్నారు. ఆశ్చర్యం !! ఇంత పాతచిత్రం ఎలా దొరికిందో ఈ చానల్ వారికి. ఒక అరగంట అయ్యేసరికి అందరకీ విసుగొచ్చింది.

         అహహ! తమరు అపార్ధం చేసుకోవద్దు. విసుగెత్తడం చిత్రం బాగుండకకాదు. ఒక అరగంట సేపట్లో నాలుగు సార్లు బ్రేక్ అంటూ చూపించిన ప్రకటనలే చూపిస్తూ కాలయాపన చేస్తున్నందుకు. అయినా వోపిక వహించి చిత్రం చూస్తున్నారు. తమకు తెలియందేముంది, ఘనమైన రాష్ట్ర ప్రభుత్వం సూచనమేరకు కరెంట్ కట్ రోజూ నాలుగు గంటలు తప్పనిసరి కోతలో ఈ సమయం వకటి. ఇంకేంవుంది! రెండు గంటలవరకూ మళ్ళీ కరెంట్ రాదు. అప్పటికి సినిమా చూపించడం అయిపోతుంది. వుసూరుమంటూ వెళ్ళి నిద్రకు వుపక్రమించారు.


***        ***        ***        ***

         ఆ సభాప్రాంగణం జనంతో కిక్కిరిసి వుంది. ప్రక్క కర్టెనునుంచి కార్యదర్శి ప్రవేశిస్తాడు)

         కార్యదర్శి: సభకు నమస్కారం. ఈనాడు ఎంతో సుదినం. ప్రఖ్యాత టివి ఛానల్ నిర్మాతగారిని వారి ఇటీవల ప్రదర్శింపబడుతున్న భయం భయం బాబోయ్ అనే సీరియల్ అయిదువందల ఎపిసోడ్లు ప్రదర్శింపబడిన సందర్భంగా వారికి మాసంఘం తరఫున పురజనులకోరికపై ఈ సన్మాన సభ ఏర్పాడు చేయడమైనది. ఇప్పుడు ఈనాటి ఈ సన్మాన సభకు అధ్యక్షతవహించవలసినదిగా మాసంఘ అధ్యక్షులవారిని వేడుతూ వేదికమీదకు రావలసిందిగా కోరుతున్నాను.

         చప్పట్లు (జనం చప్పట్లు కొట్తారు)

         ఇప్పుడు ప్రఖ్యాత టివి ఛానల్ నిర్మాతగారిని వేదికమీదకు రావలసిందిగా సగౌరంగా వినయపూర్వకంగా వేడుతున్నాను. మళ్ళీ చప్పట్లు. ఆలస్యం చెయ్యకుండా మా అధ్యక్షులవారిని సభను ప్రారంభించవలసినదిగా కోరుతున్నాను.

         అధ్యక్షుడు: సభకు నమస్కారం. వేదికను అలంకరించిన ప్రఖ్యాత టీవి ఛానల్ నిర్మాతగారికి ప్రత్యేక అబివందనలు. సారీ! వారు నాకన్నా వయస్సులో చిన్నవారుకనుక అభినందనలు. ఇప్పుడు బ్రేక్.

         కార్యదర్శి: ఒక ప్రకటన! మీకు రుచికరమైన వంటకములతో అద్భుతమైన భోజనం కొరకు కడప విలాసును దర్శించండి. ఒకసారి వెళ్ళితే ఇక అసలు మీ ఇంటి భోజనం చేయరు టింగ్ టింగ్ (అని స్టీలు పళ్ళాన్ని గరిటెతో వాయిస్తాడు)

అధ్యక్షుడు: వీరు నాకన్నా వయస్సులో చిన్నవారుకనుక అభినందనలు. వీరు భయం భయం బాబోయ్ అనే తమ టివి సీరియల్ అయిదువందల ఎపిసోడ్లు గత ఏడాదిన్నరనుండి ప్రసారం చేసిన ఇంకా చేయబోతున్న సందర్భంగా పురజనుల కోరికపై ఈ సన్మానం చేయబడుతోంది. ఇప్పుడు కొంచెం విరామం.

         కార్యదర్శి: ఒక ప్రకటన! మీకు రుచికరమైన వంటకములతో అద్భుతమైన భోజనం కొరకు కదప విలాసును దర్శించండి. ఒకసారి వెళ్ళితే ఇక అసలు మీ ఇంటి భోజనం చేయరు టింగ్ టింగ్ (అని స్టీలు పళ్ళాన్ని గరిటెతో వాయిస్తాడు).

         అధ్యక్షుడు: వీరు నాకన్నా వయస్సులో చిన్నవారుకనుక అభినందనలు. వీరు భయం భయం బాబోయ్ అనే తమ టివి సీరియల్ అయిదువందల ఎపిసోడ్లు గత ఏడాదిన్నరనుండి ప్రసారం చేసిన ఇంకా చేయబోతున్న సందర్భంగా పురజనుల కోరికపై ఈ సన్మానం చేయబడుతోంది.. వీరి సీరియల్ లో ఇప్పటికి రెండువందల పాత్రలను ప్రవేశపెట్టారు. ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు బ్రేక్.

         కార్యదర్శి: ఒక ప్రకటన! మీకు రుచికరమైన వంటకములతో అద్భుతమైన భోజనం కొరకు కదప విలాసును దర్శించండి. ఒకసారి వెళ్ళితే ఇక అసలు మీ ఇంటి భోజనం చేయరు టింగ్ టింగ్ (అని స్టీలు పళ్ళాన్ని గరిటెతో వాయిస్తాడు).

         అధ్యక్షులు: వీరు భయం భయం బాబోయ్ అనే తమ టివి సీరియల్ అయిదువందల ఎపిసోడ్లు గత ఏడాదిన్నరనుండి ప్రసారం చేసిన ఇంకా చేయబోతున్న సందర్భంగా పురజనుల కోరికపై ఈ సన్మానం చేయబడుతోంది. వీరి సీరియల్ లో ఇప్పటికి రెండువందల పాత్రలను ప్రవేశపెట్టారు. ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. అన్ని పాత్రలను అన్ని సంఘటనలను గుర్తుపెట్టుకోవడం ప్రేక్షకుల మేధాశక్తిపై ఆధారపడివుంది. అంటే ఈ విధంగా ప్రేక్షకుల మేధాశక్తిని పెంపొందచేస్తున్నారు.ఇప్పుడు బ్రేక్.

         కార్యదర్శి: ఒక ప్రకటన! మీకు రుచికరమైన వంటకములతో అద్భుతమైన భోజనం కొరకు కదప విలాసును దర్శించండి. ఒకసారి వెళ్ళితే ఇక అసలు మీ ఇంటి భోజనం చేయరు టింగ్ టింఘ్ (అని స్టీలు పళ్ళాన్ని గరిటెతో వాయిస్తాడు).

         అధ్యక్షుడు: వీరి సీరియల్ లో ఇప్పటికి రెండువందల పాత్రలను ప్రవేశపెట్టారు. ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. అన్ని పాత్రలను అన్ని సంఘటనలను గుర్తుపెట్టుకోవడం ప్రేక్షకుల మేధాశక్తిపై ఆధారపడివుంది. అంటే ఈ విధంగా ప్రేక్షకుల మేధాశక్తిని పెంపొందచేస్తున్నారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రయోగమే. ఇందుకు వారెంతో అభినందనీయులు. ఇప్పుడు బ్రేక్.

ఒకప్రేక్షకుడు: ఆగండి ఆగండి. ఇందాకట్నుంచి గమనిస్తున్నా! మీరు కొంచెం చెప్పి బ్రేక్ అనడం మీకార్యదర్శిగారు కడప విలాస్ గురించి చెప్పడం ఏమిటి మీవుద్దేశ్యం? మేము మీరు చెప్పే చెత్త ప్రకటన వినడానికి వచ్చిన మూర్ఖులమనుకున్నారా?

         అధ్యక్షుడు: క్షమించాలి. ఈ సన్మాన కార్యక్రమానికి ప్రాయోజకులు కడప విలాస్ వారు. సహప్రాయోజకులు ఎవరూ దొరక్కపోవడంతో మొత్తం ఖర్చు కడప విలాస్ వారినే భరించమంటే ఈ సన్మానంలో ఇరవై సార్లు తమ హోటల్ గురించి ప్రకటన చేసే నిబంధనమీద మొత్తం ఖర్చు భరించడానికి వొప్పుకునారు. అయినా సన్మానం చేయించుకునే నిర్మాతగారికి ఏఅభ్యంతరం లేదని వారిదగ్గర హామీ పుచ్చుకున్నాం కూడా.

         ప్రేక్షకుడు: ఏమండీ నిర్మాతగారూ! నిజమా!

         నిర్మాత: అవునండి. ప్రాయోజకులు లేకపోతే ఏకార్యక్రమమైనా నడవదని నాకు అనుభవపూర్వకంగా తెలుసు. కనుక దయచేసి మీరు కూర్చోవలసిందిగా ప్రార్ధన.

         ప్రేక్షకుడు: ఛీ సిగ్గులేదటయ్యా! లేవండర్రా! ఈవేళ వీడి సంగతి చూడాలి.

***        ***        ***        ***

         ఆగండి దయచేసి వారిని ఏమీ చెయ్యవద్దు ఆగండి ప్లీజ్ ఆగండి...

         "ఏమిటండి అలా అరుస్తున్నారు. లేవండి బారెడు పొద్దెక్కింది."

         "అదేమిటి అలా అయోమయంగా చూస్తున్నారు మళ్ళీ ఏమన్నా కలగన్నారా ఏమిటి కొంపతీసి?"

ఆమె - అతడు - ఒకనాడు (నిర్వచన పద్యరూపకం: )

ఆమె:లేవరేమి చాలలేటయ్యెనీపొద్దు
అతడు:అబ్బ! ఎందుకట్లు అరతువీవు?
ఆమె:బాగు! నాది అరుప? బారెడు పొద్దాయె
అతడు: బద్దకంబు తీరవలదెనాకు
ఆమె:పదికి ముందె మీరు పక్కెక్కినారుగ
అతడు:అబ్బ! లేచుచుంటి అరవింక
ఆమె:పళ్ళుతోముకొనగ బాత్రూముకెళ్ళుడు
అతడు: బెడ్డు కాఫి తెమ్ము వేగముగను
ఆమె:పాచిముఖముతోన? పాచిక పారదు
అతడు:చాలు చాలు నాకు చావు వచ్చె
ఆమె:మంచి చెప్ప చావు మాటేల నిప్పుడు
అతడు:నాదె తప్పు యింక నన్ను వదలు

***        ***        ***        ***

ఆమె:వచ్చినార? ఇదిగొ బ్రహ్మాండమౌ కాఫి
అతడు:అబ్బ! నోరు కాలె ఆర్చి యిమ్ము
ఆమె:ఆర్చుకొనుడుమీరు అదికూడ రాదేమి
అతడు:నిన్ను సాయమడుగ నెపము నాది
ఆమె:వంటలోకి నేడు వండునదేమిటో
అతడు:వేళకింత పెట్టు తాళలేను
ఆమె:లేటు చేసినాన? ఏటికిట్లందురు?
అతడు:సర్లె వండుమేదొ సర్దుకొందు
ఆమె:కూరలింటలేవు కొనితెండు వేగాన
అతడు:ఊరగాయలేద? కూరలేల?
ఆమె:సాకులేల ఇదిగొ సంచి మనీపర్సు
అతడు:సర్లె పోయి వత్తు చంపబోకు
ఆమె:సంచిలోన సరకు సగమైన లేదేమి
అతడు:ధరలు మండుచుండె సరకులంతె

***        ***        ***        ***

ఆమె:వంట అయినదింక వడ్డించెదను రండు
అతడు:కర్రి ఏలయిట్లు కరకరమనె
ఆమె:బెండ ముదురుగనుక వండినా యిట్లాయె
అతడు:ఏమడిగిన తప్పు లెంతువుగద

***        ***        ***        ***

ఆమె:తిండి సరిగ మీరు తినలేదు పాపము
అతడు:వేళమించుచుండెవెళ్ళుచుంటి
ఆమె:మధ్యవేళ టిఫిను మరువకుండ తినుడు
అతడు:మాడవలదు నీవు కూడ తినుము
ఆమె:ఇంటి కొచ్చునపుడు ఈసరుకులు తెండు
అతడు:ఈవినింగు రమ్ము నీవుకూడ
ఆమె:సరుకులను కొనుటకు సరదాగ వత్తును
అతడు :వంట చేయవలదు ఇంటిలోన

***        ***        ***        ***


ఆమె:ఫైవుస్టారు హొటల? వద్దండి దండుగ
అతడు:ఖర్చుగూర్చి నీవు కవలపడవలదు
ఆమె:ఆర్డరిచ్చినారు అన్నితినగలమా?
అతడు:ముందు రుచినిచూడు తొందరేల
ఆమె:అబ్బొ! కడుపునిండె ఆయాస మొచ్చెను
అతడు:తిను హిమక్రిమిదియె తీయగుండు
ఆమె:చల్లగాలి ఎంతొ చక్కగా యుండెనో
అతడు:బీచి వడ్డు గనుక వీచె గాలి
ఆమె:ఎంతప్రేమమీకు ఇవ్విది నాపైన
అతడు:కలనుగూడ నిన్నె కలవరింతు

***        ***        ***        ***

ఆమె:నిదురపోయినార? నేను వచ్చితి లెండు
అతడు:నిదుర వచ్చుచుండె నిజము వినుము
ఆమె:మంచిచెడ్డలసలు మాట్లాడరా ఏమి?
అతడు:గుర్రు గుర్రు గుర్రు! గుర్రు గుర్రు!!

అలా అవుతుందనుకోలేదు

 రైలు విజయవాడ సమీపిస్తోంది. ఆ రెండేళ్ళ పిల్లాడు ఖమ్మం దాటిన దగ్గర్నుంచీ ఒకటే ఏడుపు.
ఆకలేమోనని బిస్కట్ పెడదామనికాబోలు సంచీ వెతికింది ఆతల్లి. అయిపోయాయేమో, భర్తకేసి చూసి వచ్చే స్టేషన్లో ఏమన్నా కొనండి అని అడిగింది.

        "సార్! వచ్చే స్టేషన్ ఏమిటండి?" అడిగాడు తండ్రి.

        "విజయవాడ" అన్నాను .

        "ఆ స్టేషనులో తినడానికి దొరుకుతాయాండి?"

        ఏమిటి విజయవాడలో తినడానికి ఏమన్నా....??? నాకు అనుమానం వచ్చి, "మీరు ఈ ప్రాంతానికి కొత్తా" అని అడిగా.

        "అవునండి. లక్నోలో వుంటున్నాం. పుట్టి బుద్ధి ఎరిగాక, దక్షిణాది ప్రాంతాలకే ఇంతవరకూ రాలేదండి"

        నాకు ఆశ్చర్యం వేసింది.

        "మరి తెలుగు బాగానే మాట్లాడుతున్నారే?"

        "మేం తెలుగువారమే. మా తండ్రిగారు లక్నోలో ఏభై ఏళ్ళ క్రితమే సెటిల్ అయ్యారు"

        ఈ సంభాషణ జరుగుతున్నంతసేపూ బ్యాక్ గ్రౌండ్లో పిల్లవాడి ఏడుపు వినబడుతూనేవుంది. "విజయవాడలో తినడానికి దొరుకుతాయి. భోజనం కూడా దొరుకుతుంది" అని అన్నాను.

        ఇంతలో రైలు వేగం తగ్గింది

        "అదిగో విజయవాడ వచ్చేసాం."

        "మీరు ఎందాకా వెళ్తున్నారు?"

        "తెనాలి. మీరో?" అడిగా

         "మద్రాసు"

        రైలు విజయవాడలో ఆగింది. ప్లాట్ ఫారం మీద చాలా సందడిగావుంది. పులిహార, పెరుగన్నం పొట్లాలు అమ్మకానికి వచ్చాయి, చెరో మూడూ కొన్నాడు. తల్లి పెరుగు అన్నం పొట్లం విప్పి ఒక ముద్ద వాడి నోట్లో పెట్టింది. ఠక్కున ఏడుపు ఆపేసి, తినసాగాడు. మరి వాడికి నచ్చలేదో ఏమో తల్లిచేతిలోని పొట్లంలోకి వుమ్మేసాడు.
"ఛీ వెధవా!" అని తల్లి కసిరి పొట్లం సీటు మీద పెట్టింది.

         "ఏమైంది?"

        "ఏమో వీడు తినడంలేదు"

        తండ్రి మరొక పెరుగు పొట్లం విప్పి కొంచెం రుచి చూసి, "అబ్బా! పులుపురొడ్డు" అని కిందపెట్టేసాడు .

        ప్లాట్ ఫారం మీద ఒక కుర్రాడు వీళ్ళూ పొట్లాలు విప్పి తింటున్నారని గమనించి కిటికీ దగ్గరకు వచ్చి అమ్మా అని చెయ్యి జాపాడు..

        "ఇదిగో ఆపెరుగు పొట్లాలు రెండూ వాడికి ఇచ్చెయ్, ఆ ఎంగిలి చేసింది ఇవ్వకు కిందపారెయ్" అని హెచ్చరించాడు భార్యను.

        ఆమె ఆరెండు పెరుగు పొట్లాల్ని ముష్టివాడికి ఇచ్చింది. ఇంతలో బిస్కట్లు అమ్ముతూ వచ్చాడు ఒక వెండరు. తండ్రి బిస్కట్ పొట్లం కొని కొడుక్కి రెండు బిస్కట్లు ఇచ్చాడు. వాటిని తినడం మొదలుపెట్టాడు కుర్రాడు.

         "ఇదేమిటి? ఆపెరుగు పొట్లం పారెయ్యకుండా ఇంకా ఎందుకు అట్టేపెట్టావ్? ఆవతల పారెయ్!" అన్నాడు తండ్రి.

        ఆ పెరుగుపొట్లాన్ని మడిచి ఎదురుగా వున్న కిటికీలోంచి పట్టాలమిదకు విసిరేసింది. అది పట్టాలకి ఇవతలపడింది. ఒక చిన్న కుక్కపిల్ల ప్లాట్ ఫారం మీదనుంచి చెంగున పట్టాల మధ్యకి దూకి ఆ పొట్లంలోని పెరుగు అన్నం ఆబగా తినసాగింది.

        పాపం అది గమనించలేదు. ఆదే పట్టా మీదకు ఒక రైలు నిమ్మదిగా వచ్చి ఆగింది...

        పొట్లంలోని పెరుగు అన్నం ఎర్రగా అయిపోయింది.

అసమర్ధుని ఆక్రోశం (పద్య కవిత)

ఏట్టెట్టా !! నువ్వేనా??
ఇట్టా వస్తావనుకొను ఎదురుగ చూస్తే
అట్టే చాటుగ పోతివి
పుట్టేమి మునిగె కనపడివుంటే మాకూ

చుట్టానివి కావని మే
మెట్టాగనుకొందుమయ్య మేమేగాదా
ఇట్టా ఈగుడిలోనే
నిట్టగనిలబెట్టినాము నిన్నే ఎపుడో

అట్టిట్టూ చూడవుగద
చుట్టూ జరిగేది చూచు చూపేలేదా
మట్టా మసానమా? ఏ
మట్టా పలుకాడకుండ మనగలవయ్యా?

తిట్టిన, అరచిన, చివరకు
కొట్టిన కూడా బదులాడకుండినచో, ఇం
కెట్టా వేగుట? ఔరా
అట్టే వుంటావ విగ్రహంగా ఎపుడూ

ఒట్టింకెప్పుడునేనిను
కొట్టను, దూషించనయ్య కోపించకుమా!
అట్టుడికిపోయె దేశము
వుట్టినె నిల్చుండుటేల ఒకపరి రావా??

కవిత్వ అస్తిత్వం

నల్లని ఆకాశంలో
మిలమిల మెరిసే తారకలు
ఈ రోజు అమావాశ్యకదూ
శశాంకునుకి శలవు కాబోలు
కవి మస్తిష్కంలో భావాలు
గిరగిరా సుడులు తిరిగి
తెల్లని కాగితంమీద
నల్లని గొలుసుకట్టు గింజల్లా
బాల్ పెన్ లోంచి జాలు వ్రాలుతున్నాయి
చీకటి పడ్డకొద్దీ తారలు
మరీ మెరుస్తున్నాయి
రాసినకొద్దీ అక్షరాలలో చైతన్యం
ప్రభవిల్లుతోంది
అవి కవితా సౌకుమార్యాన్ని అలంకరించుకొని
కులుకుతూ సాహితీ లోకంలోకి
పయనిస్తోంది
తెల్లవారేసరికి తారలు మరో ఖండం మీదకు
చేరుతున్నాయి
తారల అస్తిత్వానికి ఢోకాలేదు మేఘం అడ్డురాకపోతే
అదే సర్వాంతర్యామి వునికికి తార్కాణం
కవితాఝురీపాతవేగానికి ఆపులేదు
ఆస్వాదకులు మెచ్చుకున్నంతవరకూ
అదే తెలుగు నుడికారపు తేనెపలుకుల తీయదనం

తలలు పండిన భావాలు

ఉదయమే అద్దంలో చూసుకున్నా
వులిక్కిపడ్డా ఎవరీ మనిషని
కాని ముడతలుపడ్డ మొహంలో
పోలికలు గుర్తుకు వచ్చాయి

వయస్సు పెరిగినకొద్దీ
బాల్యం గుర్తుకొస్తోంది
ఆభావనలో
వయస్సూ తరిగిపోతోంది

వయస్సు ముదురుతూవుంటే
ఈ రోజే ఆఖరనుకోవాలి
పెరట్లో ఒక పళ్ళ మొక్కనాటితే
కలకాలం బ్రతుకవచ్చు

Thursday, July 12, 2012

తోటకూరనాడైనా

"అమ్మా అమ్మా ఏంతెచ్చానో చూడు" అంటూ ఎనిమిదేళ్ళకుర్రాడు తల్లి దగ్గరకు వచ్చి పుస్తకాలసంచీలోంచి ఒక తోటకూరకట్ట ఆమెచేతిలో పెట్టాడు .
"ఎక్కడిదిరా?" అని తల్లి అడిగింది
"పక్క వీధిలో సైకిలుమీద తెచ్చి అమ్ముతున్నాడు. ఓయింట్లో తోటకూర ఇవ్వడానికి వెళ్ళాడు. వాడుచూడకుండా ఒక కట్ట తీసుకు వచ్చా " అన్నాడు కుర్రాడు గర్వంగా!
"మా నాయనే! ఎంచక్కా ఈవేళ పులుసు కాస్తా" అంది తల్లి ముచ్చటపడుతూ
భోజనంచేస్తూ "తోటకూర ఎక్కడిదే?" అని భర్త అడిగాడు.
"మన బుజ్జోడు తెచ్చాడండి" అంది
"డబ్బులెక్కడివిరా?"
"కొనలేదుట. అమ్మేవాడు చూడకుండా తెచ్చాడుట."
"పోనీలే! వుట్టినే అన్నంలోకి ఆధరవు దొరికింది" అన్నాడుతృప్తిగా
**
అయిదేళ్ళతర్వాత
"అమ్మా! ఇదిగో " అని గాజు ఇచ్చాడు
"ఒరే ఇది బంగారందిగదరా! ఎక్కడిదిరా?"
"ప్రైవేటు మేష్టారు పెళ్ళంగారిదే!"
"కొంపతీసి ఆరు చూడలేదుగదా?"
లేదే! అమ్మగారు వంటింట్లో వున్నారు. అయ్యగారు వంటేలుకు వెళ్ళారు. ఆరి గదిలో బీరువాలోంచి ఎవరూ చూడకుండా తెచ్చా"
"సానాబాగుందిరా. రేపటేల అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి కరిగించేస్తా.: తల్లి మురిసిపోయింది
** ** **
మరో పదేళ్ళ తర్వాత
"ఏం అమ్మా అలా దిగాలుగా వున్నావ్ ?"
"ఏంటోరా! నీకు చదువు సంధ్య అబ్బలేదు. వుద్యోగం సద్యోగంలేదు. మీ నాయన మనల్ని వంటరిచేసి పోయాడు. ఎలాబ్రతుకుతామో ఏంటో" కళ్ళు వత్తుకుంంది తల్లి
"అమ్మా! నాన్నపోయాడని దిగులు పడకు. నేనున్నాగా!"
అదేరోజు రాత్రి బ్యాంకు దొంగతనంచేస్తూ పట్టుబడ్డాడు.
మర్నాడు తల్లికి ఈవార్త తెలిసి లబో దిబో మంటూ పోలీసు స్టేషనుకు వెళ్ళింది.
కొడుక్కి బేడీలువేసి కోర్టుకు తీసుకువెళ్ళడానికి వ్యాన్ ఎక్కించారు. ఆమే వచ్చేలోగా వ్యాను కదిలి వెళ్ళిపోయింది.
ఆతల్లికి దుఃఖం ఆగలేదు. నేలమీద చతిలిలపడింది. ఒకసారి గతం గుర్తుకు వచ్చింది.
"అయ్యో తోటకూరనాడైనా వారించలేకపోతినిరా కొడుకా!" అని వెక్కి వెక్కి ఏడ్చింది.